కర్నూలు న్యూస్‌టుడే:
రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ను అడ్డుపెట్టుకుని ఆయన కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. డోన్‌లో సోదరుడు కేఈ ప్రతాప్ వేస్తున్న నామినేషన్ కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. పాత బస్టాండులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారన్నారు. కేసుల్లో శిక్ష పడితే జైలులో ఉంటారని, ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కేఈ, కోట్ల కుటుంబాలతోపాటు రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా కొనసాగుతున్న కుటుంబాలను తెదేపా గొడుగు కిందకు చేర్చి ఫ్యాక్షన్ నిర్మూలనకు కృషి చేస్తున్నారని కొనియాడారు. జగన్ ప్రకటిస్తున్న నవరత్నాలు నకిలీ రత్నాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో కోటిమంది ఆడపడుచులు ముఖ్యమంత్రి ఇస్తున్న పసుపు కుంకుమ చాలంటున్నారన్నారు. 70 లక్షలమంది తెదేపా కార్యకర్తలు, డ్వాక్రా మహిళల అండదండలతో రాష్ట్రంలో 150 పైగా స్థానాల్లో గెలుస్తామని, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి దేశంలో చక్రం తిప్పుతామన్నారు. ప్రధాని మోదీనే కాకుండా తెలంగాణ మోదీ కేసీఆర్, ఆంధ్రామోదీ జగన్‌లు కలిసినా తమను ఏమీ చేయలేరన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్నారన్నారు. కోట్ల, కేఈ కుటుంబాలను కలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సినీ నటుడు వేణుమాధవ్ ఎన్టీఆర్ పార్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి అభిమానిగా ఉంటూ.. నేటికీ పార్టీకి సేవలు చేస్తున్నారని కొనియడారు.
No comments:
Post a Comment