Wednesday, March 20, 2019

రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం……….


తూర్పు గోదావరి గోకవరం, న్యూస్‌టుడే:
*నానిబాబు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు..
ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని గ్యాస్‌ సిలిండర్ల లారీ ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని వీర్లంకపల్లి వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గంగవరం మండలం యండపల్లి గ్రామానికి చెందిన కురసం అబ్బాయిదొర, అచ్చియమ్మలు గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. వీరి కుమారుడు నానిబాబు(7) వై.రామవరం మండలం గొడుగురాయిలో తాత వద్ద ఉండి చదువుతున్నాడు. నానిబాబుకు ఆరోగ్యం బాగలేపోవడంతో అబ్బాయిదొర, అచ్చియమ్మలు గొడుగురాయి వెళ్లి బైక్‌పై తీసుకొస్తున్నారు. మరికొంత దూరంలోనే గమ్యం చేరుతామనగా వీర్లంకపల్లి సమీపంలో రాజు చెరువుగట్టుపై గ్యాస్‌ సిలిండర్లతో వస్తున్న లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో బైక్‌తో పాటు ముగ్గురూ కిందపడిపోవడంతో నానిబాబు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అబ్బాయిదొర, అచ్చియమ్మలు గాయాలవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కన్నకొడుకు కళ్లముందే మృత్యువాత పడడంతో అచ్చియమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సంఘటన స్థలాన్ని కోరుకొండ సీఐ వినయ్‌మోహన్, ఎస్సై చెన్నారెడ్డి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

No comments:

Post a Comment