కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే:
* నదుల అనుసంధానం చేసిన చంద్రబాబు..
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని, రాష్ట్రంలో 150+ స్థానాలు సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కోరారు. చంద్రబాబు పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని చెప్పారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన ఎన్నికల సన్నాహక సభలో ఆయన ప్రసంగించారు. నదుల అనుసంధానం చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలోని అనేక కుటుంబాలను కలిపారని, కోట్ల, కేఈ కుటుంబాల మధ్య మైత్రి చేశారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కలసికట్టుగా అందరూ పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ తన కొడుకు రాజకీయాల్లోకి వచ్చే ముందు చర్చించానని, ప్రజలకు అండగా నిలబడడంతోపాటు మాట తప్పకుండా వ్యవహరించాలని కోరానని తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా బాధ్యత తీసుకోవాలని చెప్పానన్నారు. తనకంటే మంచిపేరు తీసుకొస్తానని భరత్ చెప్పారని, తనకు పోటీ తన కొడుకేనని టీజీ చెప్పారు.

No comments:
Post a Comment