చిత్తూరు (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే :
ప్రభుత్వ శాఖలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వినియోగానికి సంబంధించి బిల్లుల సమర్పణకు బుధవారం ఆఖరు రోజు. 2019 మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించింది. ఈ నిధులను త్రైమాసికాల వారిగా కేటాయింపులు చేస్తోంది. ఆఖరి త్రైమాసికానికి సంబంధించి బిల్లుల సమర్పణకు మార్చి 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు విధించింది. ప్రభుత్వ శాఖల పరిధిలో బడ్జేట్ నిధులకు సంబంధించిన బిల్లులను ఆయా శాఖల డీడీవోలు అర్ధరాత్రి 12 గంటల లోగా సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఖజానాకు పంపాల్సి ఉంది. ప్రధానంగా కార్యాలయాల నిర్వహణ, సంక్షేమ శాఖల పరిధిలోని ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, మెస్ బిల్లులు, ఇతర ప్రధాన శాఖల పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను బుధవారంలోగా సమర్పించాల్సి ఉంది. అర్ధరాత్రి దాటితే ఈ మేరకు బడ్జెట్ కేటాయించిన నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బిల్లులన్నీ సీఎఫ్‌ఎంఎస్ ద్వారా సాగుతుండంతో ఏ ఏ శాఖలో ఎంత మేర బడ్జెట్ బిల్లులు ఉన్నాయి. ఇంకా రావాల్సిన నిధులపై ఆయా శాఖల డీడీవోలకు మాత్రమే సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో డీడీవోలు అప్రమత్తమై ఆయా శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను బుధవారం అర్ధరాత్రిలోగా సమర్పించాల్సి ఉంది. మరోవైపు ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను 21వ తేదీ నుంచి ఖజానా శాఖలో సమర్పించాలని ఖజానా శాఖ డీడీ గంగాధ్రి తెలిపారు.

No comments:
Post a Comment