Saturday, March 16, 2019

నాలుగు మద్యం దుకాణాలు సీజ్……

కర్నూలు  న్యూస్‌టుడే :
  • నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన నాలుగు మద్యం దుకాణాలను జిల్లా మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారులు సీజ్‌ చేసి చర్యలు తీసుకున్నారు…
  • మద్యం దుకాణాల అనుమతులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ చెన్నకేశవరావు తెలిపారు..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన నాలుగు మద్యం దుకాణాలను జిల్లా మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారులు సీజ్‌ చేసి చర్యలు తీసుకున్నారు. నందవరంలోని నిక్షిత వైన్స్‌ నుంచి ఓ వ్యక్తి 76 మద్యం సీసాలు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. 70 కేసులతో సహా మద్యం దుకాణాన్ని సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.5 లక్షలు ఉంటుందని తెలిసింది. కోడుమూరు స్టేషన్‌ పరిధిలోని గూడూరులో సూర్య వైన్స్‌ దుకాణం సమీపంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తుండగా ఉల్లంఘనగా పరిగణించారు. రూ.8 లక్షల విలువ చేసే 1080 కేసుల మద్యంతో పాటు దుకాణాన్ని సీజ్‌ చేశారు. నంద్యాలలో సూర్యవైన్స్‌కు సంబంధించిన మద్యం అనధికార ప్రదేశంలో నిల్వ ఉండటంతో 200 కేసుల మద్యం, దుకాణాన్ని సీజ్‌ చేశారు. బేతంచెర్లలో రమ్య వైన్స్‌కు సంబంధించి 340 కేసుల మద్యం అనధికారప్రదేశంలో ఉంచటంతో సీజ్‌ చేశారు. మద్యం దుకాణాల అనుమతులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ చెన్నకేశవరావు తెలిపారు. మద్యం వ్యాపారులు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించి అనుమతులు రద్దు చేస్తామని డిప్యూటీ కమిషనర్‌ హెచ్చరించారు.

No comments:

Post a Comment