Thursday, February 28, 2019

సామాన్యుడిపై పెనుభారం పెడుతున్న ప్రభుత్వం……

మరోమారు వంట గ్యాస్ ధరలు మంట పుట్టించనున్నాయి. డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్‌ ధరను మరోసారి పెంచాయి. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటంతో ధరాఘాతం సామాన్యులకు శరాఘాతంగా మారింది .
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, విదేశీ మారకం విలువలో ఒడిదొడుకుల నేపథ్యంలో ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. ఒక్కో సబ్సి డీ సిలిండర్‌పై రూ.2.08, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.42.5 పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) గురువారం తెలిపింది. వరుసగా గత మూడునెలలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి.కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా తిరిగి ధరల పెంపు జరుగుతోంది.ప్రస్తుతం ఏటా 12 వంట గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నది.
ప్రస్తుతం పెరిగిన చమురు ధరలపై పన్ను ప్రభావంతో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు తప్పని సరైందని ఐవోసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.53 ఉండగా, మార్చి ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలతో రూ.495.61 కానుంది. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ.701.50కు పెరగనుంది .

No comments:

Post a Comment